: మరోసారి అడ్డంగా దొరికిపోయిన పాక్... ‘పఠాన్ కోట్’పై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదట
ఉగ్రవాదులకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన పాకిస్థాన్ తన నైజాన్ని మరోమారు చాటుకుంది. పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన దాడిలో పాక్ జాతీయులే పాలుపంచుకున్నారని, ఈ దాడికి రూపకల్పన కూడా పాక్ భూభాగం మీదే జరిగిందని పక్కా ఆధారాలు సేకరించిన భారత్, వాటిని పాక్ కు అందజేసింది. దాడులకు కీలక సూత్రధారిగా వ్యవహరించిన జైషే మొహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ పై చర్యలు తీసుకోవాలని భారత్ కోరింది. భారత్ డిమాండ్ తో వేగంగా స్పందించిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్... తన దేశంలోని కీలక దర్యాప్తు సంస్థల అధికారులతో అత్యున్నత దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఒకానొక సందర్భంగా మసూద్ సహా పలువురు కీలక నిందితులను అరెస్ట్ చేసినట్లు సాక్షాత్తు పాక్ ప్రధాన మంత్రిత్వ కార్యాలయం ప్రకటించింది. అయితే మసూద్ అరెస్ట్ కాదు కదా, ఒక్కరిని కూడా ఆ దేశం అరెస్ట్ చేయలేదని తేలిపోయింది. తాజాగా అసలు పఠాన్ కోట్ దాడికి సంబంధించి ప్రాథమికమైన ‘ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్’ (ఎఫ్ఐఆర్) నమోదు కాలేదని తేలింది. దర్యాప్తు బృందం ఏర్పడ్డ తర్వాత కేసు దర్యాప్తు శరవేగంగా సాగుతున్నట్లు బిల్డప్ ఇచ్చిన పాక్, మరిన్ని ఆధారాలు కావాలంటూ భారత్ కు లేఖ రాసింది. తాజాగా ఎఫ్ఐఆరే నమోదు కాలేదని తేలడంతో... ఈ కేసు దర్యాప్తును పాక్ చిత్తశుద్ధితో జరపడం లేదని మరోమారు తేలిపోయింది.