: పురానాపూల్ డివిజన్ లో రీపోలింగ్... మొత్తం 36 పోలింగ్ కేంద్రాలకు వర్తింపు
ప్రశాంతంగా ముగిసిన గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో పాతబస్తీలో మాత్రం అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఎన్నికల సరళిని పరిశీలించేందుకు వచ్చిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ పై దాడి చేసిన మజ్లిస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీపై పిడిగుద్దులు కురిపించారు. ఈ ఘటనతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై నిన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిని కలిసిన టీపీసీసీ ముఖ్యులు రీపోలింగ్ కు డిమాండ్ చేశారు. ఘటన పూర్వాపరాలను పరిశీలించిన మీదట పురానాపూల్ డివిజన్ వ్యాప్తంగా రీపోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం రేపు డివిజన్ లోని మొత్తం 36 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. 34 వేల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును మరోమారు వినియోగించుకోవాల్సి ఉంది.