: 56 దేశాల ప్రతినిధులు వస్తున్నారు...ఇదా సందర్భం?: చంద్రబాబు ఆగ్రహం
56 దేశాల ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న శుభసందర్భంలో జరుగుతున్న సంఘటనలు ఎలాంటి సంకేతాలు పంపుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, దేశంలో ఇది రెండోసారి జరుగుతున్న ఫ్లీట్ రివ్యూ అనీ, అందుకు విశాఖపట్టణం ఎంపికైందని, దీనికి మనం గర్వించాలని ఆయన అన్నారు. దీనికి అంతర్జాతీయ స్థాయిలో అంతులేని గుర్తింపు ఉందని ఆయన చెప్పారు. దీనిని చూసి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అలాంటి శుభ సందర్భంలో రాష్ట్రంలో ఎలాంటి అలజడులు లేని చోట ఒక్కసారిగా ఆందోళనలు ఎలా పెల్లుబికాయని ఆయన నిలదీశారు. కాపులు, బీసీల్లో విద్వేషాలు రేపే కుట్ర జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. ఆమధ్య రాష్ట్రంలో నిర్వహించిన సదస్సు వల్ల నాలుగు లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయని ఆయన తెలిపారు. అలాంటి సమయంలో ఇంత పెద్ద సంఘటన ఎలా జరిగిందని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వం కాపులకు వ్యతిరేకమైన నిర్ణయం ఏదీ తీసుకోనప్పుడు ఇంత పెద్ద స్థాయిలో విధ్వంసానికి ఎలా పాల్పడతారని ఆయన ప్రశ్నించారు.