: విమానం డోర్ వద్ద పేలుడు... సురక్షితంగా ల్యాండ్ చేసిన పైలెట్!
సోమాలియాలో పైలట్ అప్రమత్తతతో పెను విమాన ప్రమాదం తప్పింది. తాజాగా సోమాలియాలో డాలో ఎయిర్ లైన్స్ కు చెందిన డీ3159 విమానం జిబౌతికి వెళ్లేందుకు టేకాఫ్ తీసుకుంది. గాల్లో లేచిన ఐదు నిమిషాలకు ఈ విమానం ఇంజిన్ ఉండే రెక్క భాగంలో డోర్ వద్ద ఢామ్మని పేలుడు సంభవించింది. అందరూ చూస్తుండగా మండుతున్న ఒక వ్యక్తి 14 వేల అడుగులపై నుంచి కిందపడిపోయాడు. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించి సురక్షితంగా కిందికి దించాడు. దీంతో ప్రయాణికులంతా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. తన జీవితంలో ఇలాంటి సంఘటన చూళ్లేదని, అది బాంబు పేలుడు అని, లక్కీగా విమానం కంట్రోల్ తప్పలేదని, అందుకే సురక్షితంగా దించగలిగానని పైలట్ పేర్కొన్నాడు. ఇదే విమానంలో ప్రయాణిస్తున్న సోమాలియా అంబాసిడర్ మాట్లాడుతూ, 'విమానంలో పెద్దపెట్టున పేలుడు సంభవించింది. అక్కడ ఏమీ కనబడలేదు. నల్లని పొగ మాత్రం చాలా సేపు వచ్చింది' అన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, కిటికీలోంచి కిందపడిన వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడి తనను తాను పేల్చుకుని కిందపడ్డాడా? లేక పేలుడు ధాటికి మంటలు అంటుకుని వాటికి తాళలేక కిందపడ్డాడా? లేక పేలుడు నుంచి రక్షణగా కిందికి దూకేశాడా? అనే అంశాలను దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.