: దెబ్బకొట్టిన క్రూడాయిల్... నష్టాల్లో మార్కెట్లు!
అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పతనమైన క్రూడాయిల్ ధరలు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. క్రూడాయిల్ ధర బ్యారల్ కు మరోసారి 30 డాలర్ల దిగువకు రావడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకే మొగ్గు చూపారు. ప్రధానంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఈక్విటీలను విక్రయించినట్టు బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రాథమిక గణాంకాలు వెల్లడించాయి. బుధవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 315.68 పాయింట్లు పడిపోయి 1.29 శాతం నష్టంతో 24,223.32 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 93.75 పాయింట్లు పడిపోయి 1.26 శాతం నష్టంతో 7,361.80 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 1.30 శాతం, స్మాల్ క్యాప్ 2.25 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈ-50లో 8 కంపెనీలు మాత్రమే లాభాల్లో నడిచాయి. హిందుస్థాన్ యూనీలీవర్, యస్ బ్యాంక్, టీసీఎస్, జడ్ఈఈఎల్, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర కంపెనీలు లాభపడగా, వీఈడీఎల్, బీహెచ్ఈఎల్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 91,52,775 కోట్లకు తగ్గింది. బీఎస్ఈలో మొత్తం 2,759 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 578 కంపెనీలు లాభాల్లోను, 2,084 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి.