: అలిగిన కోట్ల... వైకాపాకా? టీడీపీకా?


ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొని కుదేలైన ఏపీ కాంగ్రెస్ లో ఇప్పటికే ఎంతో మంది నేతలు తమ పదవులకు రాజీనామాలు చేసి వెళ్లిపోగా, తాజాగా మరో నేత అదే దారిలో నడుస్తున్నట్టు కనిపిస్తోంది. నిన్న అనంతపురంలో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించి పదేళ్లు గడిచిన సందర్భంగా జరిగిన సభకు రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ లు రాగా, వేదికపైకి తనను పిలవలేదని మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి తనయుడు, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అలిగారు. తనను పిలవకపోవడాన్ని ఆయన అవమానంగా భావించగా, కోపోద్రిక్తులైన కోట్ల అనుచరులు కర్నూలులో పార్టీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. ఇక ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారన్న వార్త గుప్పుమంది. అదే నిజమైతే, ఆయన ముందున్న పార్టీలు రెండు. ఒకటి తెలుగుదేశం కాగా, మరొకటి వైకాపా. మూడవ ఆప్షన్ గా బీజేపీ ఉండనే వుంది. తన రాజకీయ జీవితాంతం తెలుగుదేశాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన ఆయన ఆ పార్టీలో చేరేందుకు ముందుకు వస్తారా? అన్నది ఇక్కడ సమాధానం లేని ప్రశ్న. ఇక వైకాపాలోకి వెళ్లాలంటే, ఆయనకు పెద్దగా అడ్డంకులు ఉండకపోవచ్చని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ, కోట్ల కాంగ్రెస్ ను వీడాలని భావిస్తే, బీజేపీలోకి ఆహ్వానించాలని ఆ పార్టీ సీనియర్లు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుండగా, కొద్ది సేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనను వేదికపైకి పిలవక పోవడం చాలా వేదన కలిగించిందని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు పార్టీ రాష్ట్ర కార్యవర్గానిదే బాధ్యతని కూడా కోట్ల ఆరోపించారు. తనను ఎందుకు పిలవలేదో రఘువీరా రెడ్డి స్వయంగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన నుంచి వివరణ వచ్చే వరకూ తాను మౌనంగానే ఉంటానని చెప్పారు. ప్రస్తుతానికి తాను పార్టీ మారుతానని వస్తున్న వార్తలు ఊహాగానాలేనని ఆయన చెప్పినప్పటికీ, జరుగుతున్న పరిణామాలు ఎటైనా దారితీయవచ్చని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News