: పాతబస్తీ దాడిలో కొత్త ట్విస్ట్!... డీసీపీతో మజ్లిస్ ఎమ్మెల్యే పాషా ఖాద్రి భేటీ, తమ పాత్ర లేదని వెల్లడి
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో నిన్న పాతబస్తీలో చోటుచేసుకున్న ఘర్షణల్లో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు పాతబస్తీకి వచ్చిన కాంగ్రెస్ నేతలపై మజ్లిస్ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ పై మజ్లిస్ కార్యకర్తలు దాడి చేసిన సమయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీపై ఓ యువకుడు పిడిగుద్దులు కురిపించాడు. ఈ ఘటన మొత్తం కెమెరాలకు కూడా చిక్కింది. ఈ నేపథ్యంలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సహా ఆ పార్టీ ఎమ్మెల్యే అహ్మద్ బలాలాలపై కేసులు నమోదు చేసిన పోలీసులు బలాలాను అరెస్ట్ కూడా చేశారు. తాజాగా మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీపైనా కేసు నమోదైంది. ఓ వైపు కేసులు నమోదవుతుండగానే, మజ్లిస్ ఎమ్మెల్యే పాషా ఖాద్రి దక్షిణ మండల డీసీపీతో కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. నిన్న జరిగిన అల్లర్లలో తమ పార్టీ కార్యకర్తల పాత్ర లేదని ఆయన చెప్పారు. అసలే ఎన్నికలు, ఆపై ఈ నెల 5న కౌంటింగ్ జరగాల్సి ఉన్న నేపథ్యంలో మజ్లిస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై కేసుల విషయంలో పోలీసులు ఆచితూచి అడుగులేస్తున్నారు. ఈ క్రమంలో పాషా ఖాద్రి చేసిన వాదనతో డీసీసీ మరింత సందిగ్ధంలో పడ్డారు.