: 'బీసీల్లోకి కాపులు' అంటే, రావణకాష్ఠమే: ఆర్ కృష్ణయ్య తీవ్ర హెచ్చరిక
కాపులను బీసీల్లో చేరుస్తామంటే, రావణకాష్ఠాన్ని రగిల్చినట్టేనని బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. కాపులు ఒక్కసారి సమావేశం పెట్టగానే భయపడుతున్నారని, ఇక, తమకు అన్యాయం జరుగుతుందని తెలిస్తే, బడుగులు వేసే అడుగులు ఎట్లా ఉంటాయో తాను ఊహించలేనని ఆయన అన్నారు. "కాపుల్లోనూ పేదలున్నారు. ఒక్క కాపుల్లోనే కాదు... బ్రాహ్మణుల్లో అంతకన్నా పేదలున్నారు. రెడ్లలో సహా ఇతర కులాల్లో పేదలున్నారు. పేదరిక నిర్మూలన కోసం ఎన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించినా సహకరిస్తాం. అంతే తప్ప బీసీ కులాల్లో కాపులను చేర్చాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోను ఊరుకోబోము. కాపు కార్పొరేషన్ కు రూ. 1000 కోట్లు ఇస్తామంటున్నారు. దాన్ని రూ. 2 వేల కోట్లకు పెంచాలని మేం డిమాండ్ చేస్తున్నాం. పేదరికాన్ని పారద్రోలే చర్యలు చేపట్టాలే తప్ప, రిజర్వేషన్లు అని పేరెత్తితే సహించే ప్రశ్నేలేదు" అని కృష్ణయ్య హెచ్చరించారు. బీసీలకు అన్యాయం జరుగకుండా, కాపులను బీసీల్లో చేరుస్తామని అనడం చంద్రబాబుకు తగదని, ఆయన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.