: సోనియాకు వ్యతిరేకంగా సాక్ష్యాలిస్తే, మీ మెరైన్లను వదిలేస్తాం..ఇటలీ ప్రధానికి నరేంద్ర మోదీ ఆఫర్...భగ్గుమన్న కాంగ్రెస్!
అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల స్కామ్ లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి వ్యతిరేకంగా సాక్ష్యాలను అందిస్తే, హత్య కేసులో నిందితులైన ఇటలీ మెరైన్ కమాండర్లను విడిచి పెడతామని ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశ ప్రధానితో డీల్ కు యత్నించినట్టు కోల్ కతా కేంద్రంగా నడుస్తున్న ఓ దినపత్రికలో సంచలన కథనం ప్రచురితమైంది. దీనిపై మండిపడ్డ కాంగ్రెస్, మెరైన్లతో డీల్, వారికిచ్చిన ఆఫర్ పై ప్రధాని కార్యాలయం స్పందించాలని డిమాండ్ చేసింది. "ప్రధాని కార్యాలయం ఈ విషయంలో వివరణ ఇవ్వాల్సిందే" అని పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. పత్రికలో వచ్చిన ఆరోపణలపై తక్షణం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ "మిస్టర్ ప్రైమ్ మినిస్టర్... ఇదంతా నిజమేనా?" అని తన ట్విట్టర్ ఖాతాలో ప్రశ్నించారు. కాగా, సెప్టెంబరు 2015లో ఇటలీ ప్రధాని మెట్టియో రెంజీతో సమావేశమైన సందర్భంగా మోదీ ఈ డీల్ కు యత్నించాడని 'ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్ ఆఫ్ ది లా ఆఫ్ దీ సీస్'కు మధ్యవర్తి క్రిస్టియన్ మైఖేల్ లేఖ రాసినట్టు బెంగాల్ పత్రిక 'టెలిగ్రాఫ్' ఓ వార్తను ప్రచురించింది. మోదీపై వచ్చిన ఈ ఆరోపణలను విదేశాంగ శాఖ తోసిపుచ్చగా, ఇటలీ మాత్రం స్పందించలేదు. ఫిబ్రవరి 15, 2012న ఇద్దరు భారత మత్స్యకారులను ఇటలీ నావికా దళానికి చెందిన సైనికులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇటలీ మెరైన్లు, ఇండియాలో విచారణను కూడా ఎదుర్కొన్నారు. ఆపై దౌత్యపరమైన ఇబ్బందులు ఏర్పడవచ్చన్న భయాలు వారిని శిక్షకు దూరం చేసే దిశగా సాగుతున్నాయి.