: గర్జనపై కేసుల వెల్లువ... బొత్స, కన్నా, సీఆర్, వీహెచ్ సహా 27 మంది నేతలపై కేసులు
ఇటీవల తూర్పు గోదావరి జిల్లా తునిలో ‘కాపు ఐక్య గర్జన’ పేరిట ఏర్పాటు చేసిన సభకు రావాలంటూ కాపు నేత ముద్రగడ పద్మనాభం ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన లభించింది. లక్షలాది మంది కాపులు తునిలోని కొబ్బరి తోటల్లో ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు. ఈ సభకు రాజకీయాలను పక్కనబెట్టి మరీ వివిధ పార్టీలకు చెందిన కాపు నేతలు తరలివెళ్లారు. ఈ క్రమంలో అక్కడ జరిగిన హింసాకాండను ప్రభుత్వం సీరియస్ గా పరిగణించింది. ముద్రగడ సహా సభకు హాజరైన పలువురిపై కేసుల నమోదుకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఇప్పటికే ముద్రగడపై అభియోగాలు మోపిన పోలీసులు ఇతర నేతలపైనా వరుసగా కేసులు నమోదు చేశారు. ఇలా కేసులు నమోదైన వారిలో వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, జ్యోతుల నెహ్రూ, అంబటి రాంబాబు, కాంగ్రెస్ పార్టీకి చెందిన సి.రామచంద్రయ్య, కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు, టీకాంగ్ నేత వి. హన్మంతరావులతో పాటు దాడిశెట్టి రాజా, ఏళ్ల దొరబాబు, కె.తాతాజీ, నల్లా విష్ణు, పరుపుల సుబ్బారావు సహా 27 మంది నేతలున్నారు.