: లోక్ సభ మాజీ స్పీకర్, సీనియర్ నేత బలరామ్ జక్కర్ కన్నుమూత
లోక్ సభ 8వ స్పీకర్, సీనియర్ కాంగ్రెస్ నేత బలరాం జక్కర్ ఈ ఉదయం 7 గంటల సమయంలో స్వగృహంలో మరణించారు. జక్కర్ వయసు 92 సంవత్సరాలు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం రేపు పంజాబ్ లోని అబోహర్ కు తరలించనున్నట్టు కాంగ్రెస్ నేత, జక్కర్ కుమారుడు సునీల్ జక్కర్ తెలిపారు. గురువారం ఉదయం 11 గంటలకు అబోహర్ సమీపంలోని పంచకోశిలో అంత్యక్రియలు జరుగుతాయని అన్నారు. కొద్దికాలం క్రితం ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పటికీ, వృద్ధాప్య సమస్యల కారణంగానే మరణించారని వివరించారు. 1980 నుంచి 1989 వరకూ లోక్ సభ స్పీకర్ గా పనిచేసిన ఆయన, ఆపై జూన్ 2004 నుంచి మే 2009 వరకూ మధ్యప్రదేశ్ గవర్నర్ గానూ బాధ్యతలు నిర్వర్తించారు. పీవీ నరసింహరావు మంత్రివర్గంలో వ్యవసాయ శాఖా మంత్రిగానూ సేవలందించారు. జక్కర్ మృతికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.