: ముద్ద'రగడ'లో ముసుగు తొలగుతోంది... మాస్క్ లతో ఉన్న వారిని పట్టించిన వీడియోలు!
మూడు రోజుల క్రితం కాపు గర్జన అనంతరం జరిగిన విధ్వంసంలో రైళ్లకు, పోలీసు స్టేషన్ కు నిప్పు పెట్టిన వారిని గుర్తించే పనిలో పోలీసుల విచారణ వేగవంతమైంది. రత్నాచల్ ఎక్స్ ప్రెస్ దహనాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న పోలీసులు, వివిధ వీడియో చానళ్లు ప్రసారం చేసిన దృశ్యాల్లో ముఖానికి ముసుగులు ధరించిన దాదాపు 300 మందిని గుర్తించినట్టు తెలుస్తోంది. వీరంతా ఎవరు? ముఖానికి మాస్క్ లు ఎందుకు ధరించారన్న విషయమై దర్యాఫ్తు జరుపుతున్నారు. అత్యధిక సంఖ్యలో కాపులంతా రైల్వే పట్టాలకు దూరంగా ఉన్నారని గుర్తించిన పోలీసులు కొన్ని వందల మంది మాత్రమే పట్టాలు ఎక్కారని, వారిలో పలువురు మాస్క్ లు ధరించారని తేల్చారు. రైల్వేశాఖ, ఆర్పీఎఫ్, జీఆర్పీ, పోలీసు శాఖలు నిందితులను గుర్తించేందుకు సంయుక్త విచారణ చేపట్టాయి. ఇక ఘటనాస్థలిలో క్లూస్ టీం ఆధారాలు సేకరించే పనిలో ఉంది. ఈ కేసుల్లో వీడియోలు, ఫోటోలు కీలకమని భావిస్తున్న పోలీసులు, సభకు వచ్చి, ఆపై తమ సెల్ ఫోన్లలో తీసిన వీడియోలు, చిత్రాలను అందించాలని కాపు సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేశారు. సభలో అసాంఘిక శక్తులు చొరబడ్డాయని, వారి కారణంగానే పెను విధ్వంసం జరిగి రూ. 130 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని పోలీసులు వెల్లడించారు. పక్కా వ్యూహంతోనే ఇదంతా జరిగిందని నిర్ధారణకు వచ్చినట్టు తెలిపారు.