: కేరళలో పట్టపగలు నడిరోడ్డుపై మారణకాండ... సోషల్ మీడియాలో వీడియో హల్ చల్
కేరళ రాజధాని తిరువనంతపురం సమీపంలో ఆదివారం పట్టపగలు నడిరోడ్డుపై దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిపై నలుగురు యువకులు మారణాయుధాలతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో బాధిత వ్యక్తి దుర్మరణం చెందగా, సదరు దాడి దృశ్యాలను సెల్ ఫోన్ లో చిత్రీకరించిన ఓ అజ్ఞాత వ్యక్తి దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఇప్పటికే దీనిని ఫేస్ బుక్ లో 6 లక్షల మంది వీక్షించారు. వివరాల్లోకెళితే... తిరువనంతపురం సమీపంలోని ఓ రైల్వే క్రాసింగ్ వద్ద మానక్కాడు వీట్టిల్ షబ్బీర్ (46) అనే వ్యక్తిపై నలుగురు యువకులు మూకుమ్మడిగా దాడికి దిగారు. పట్టపగలు చోటుచేసుకున్న ఈ ఘటనలో ఓ యువకుడు షబ్బీర్ కాళ్లు గట్టిగా పట్టుకోగా, మరో వ్యక్తి ఇనుప రాడ్ తో అతడిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆ తర్వాత ఆ నలుగురు యువకులు అక్కడి నుంచి పరారు కాగా, స్థానికులు షబ్బీర్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే కొద్దిసేపటికే షబ్బీర్ చనిపోయాడు. దీనిపై సమాచారం అందుకన్న పోలీసులు వెనువెంటనే రంగంలోకి దిగి దాడికి పాల్పడ్డ ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు.