: కాపులకు రిజర్వేషన్లే ప్రధానాంశం!... నేడు విజయవాడలో ఏపీ కేబినెట్ కీలక భేటీ
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ జరగనుంది. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయం వేదికకగా జరిగే ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ప్రధానంగా కాపులకు రిజర్వేషన్లు కల్పించే అంశంపైనే కీలక చర్చ జరగనున్నట్లు విశ్వసనీయ సమాచారం. తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన కాపు ఐక్య గర్జన హింసాత్మకంగా మారిన నేపథ్యంలో నిన్న కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాపు నేతలు తన ముందుంచిన ప్రతిపాదనలపై చంద్రబాబు సానుకూలంగానే స్పందించారు. అయితే వాటిని నెరవేర్చే అంశంపై నేటి కేబినెట్ భేటీలో కీలక చర్చ జరగనుంది. కాపు రిజర్వేషన్లతో పాటు సాగునీటి ప్రాజెక్టులు, నీరు- చెట్టు కార్యక్రమం అమలు తదితరాలపైనా కేబినెట్ చర్చించనున్నట్లు సమాచారం.