: మెగాస్టార్ చిరంజీవి భుజానికి గాయం... బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో శస్త్రచికిత్స


టాలీవుడ్ లో అగ్రస్థానానికి ఎగబాకి ఆపై రాజకీయాల్లోకి అడుగు పెట్టిన మెగాస్టార్ చిరంజీవి భుజానికి గాయమైంది. అదేదో చిన్న గాయం కాదట. ఆపరేషన్ అవసరమయ్యేంత గాయం. సినీ వినీలాకాశం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి తొలుత ప్రజారాజ్యం పేరిట కొత్త పార్టీని ఏర్పాటు చేసినా, దానిని విజయతీరాలకు చేర్చడంలో విఫలమయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిపోయిన ఆయన కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగానూ పదవీ బాధ్యతలు చేపట్టారు. 2014 ఎన్నికల్లో ఓటమితో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. చిరు కూడా మంత్రి పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన, పార్టీ కార్యక్రమాల్లో కాస్తంత చురుగ్గానే పాల్గొంటున్నారు. అయితే ఇటీవల తిరుపతిలో ఏపీసీసీ చేపట్టిన ‘నీరు-మట్టి’ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరు కాలేదు. తాజాగా ఉపాధి హామీ పథకం ప్రారంభించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా అనంతపురం జిల్లా బండ్లపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కూడా చిరు హాజరు కాలేదు. దీంతో చిరు కాంగ్రెస్ పార్టీకి దూరమవుతున్నారన్న పుకార్లు రేగాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలు అవాస్తవమంటూ ప్రకటించిన చిరంజీవి, సదరు కార్యక్రమాల్లో పాలుపంచుకోలేకపోయిన కారణాలను వివరిస్తూ నిన్న మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. తన భుజానికి గాయమైందని, ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఆ గాయానికి చికిత్స తీసుకుంటున్నానని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవలే గాయానికి శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నానని కూడా చిరు తెలిపారు. ఇక చికిత్స ముగింపు దశకు వచ్చిందని, ఈ నెల 6న హైదరాబాదు రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఏ కారణంగా గాయమైందన్న విషయాన్ని మాత్రం చిరు వెల్లడించలేదు.

  • Loading...

More Telugu News