: పాతబస్తీలో కాంగ్రెస్, ఎంఐఎం కార్యకర్తల ఘర్షణ... ఉత్తమ్ కారు అద్దాలు ధ్వంసం
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో పాతబస్తీలో కాంగ్రెస్, ఎంఐఎం కార్యకర్తల మధ్య పాతబస్తీలోని పూరానాపూల్ లో ఘర్షణ జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి గౌస్ ఖాన్, ఎంఐఎం నేత పాషా ఖాద్రీకి మధ్య ఈ మధ్యాహ్నం గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గౌస్ ను విడుదల చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉత్తమ్, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ తదితరులు మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఆందోళన చేపట్టారు. ఇదే సమయంలో ఎంపీ అసదుద్దీన్ తన అనుచరులతో కలసి స్టేషన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల వారు పోటాపోటీగా నినాదాలు చేసుకోవడంతో ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. అక్కడే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కారుపై ఎంఐఎం కార్యకర్తలు దాడి చేశారు. దాంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. వెంటనే పోలీసులు లాఠీచార్జి చేశారు. ఇరువర్గాలకు చెందిన ఆందోళనకారులను చెదరగొడుతున్నారు. పలువురిని అరెస్టు చేశారు. ఘర్షణ సమయంలో ఉత్తమ్, షబ్బీర్ లకు స్వల్ప గాయాలయ్యాయి.