: చలికాలపు బద్ధకాన్ని వదిలేయండి... మీ కోసం ఓటేయండి: లోక్ సత్తా అధినేత జేపీ
'స్థానిక సంస్థల ఎన్నికలే కదా, ఓటేసిదేమిటి? అని అనుకుంటున్నారు.. అది చాలా పొరపాటు' అని లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ అన్నారు. ఎర్రమంజిల్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ దేశం బాగుపడాలంటే అది ముందుగా స్థానికంగా మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు. ముఖ్యంగా పట్టణాల్లో, నగరాల్లో ప్రజలు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని.. స్థానిక ఎన్నికలను, స్థానికంగా అందాల్సిన సేవలను, మనం కట్టే పన్నులను చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరముందన్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు, యువత ఈ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవాలని అన్నారు. ‘స్థానిక ఎన్నికలే కదా ఓటు వేసేదేమిటి? అనుకోకుండా, చలికాలపు బద్ధకాన్ని వదిలేసి తప్పకుండా ఓటేయండి..మీ కోసం ఓటేయండి. ఈ దేశాన్ని మార్చుకోవాలంటే ఉద్యమాల ద్వారా, హింస ద్వారా సాధ్యం కాదు. కేవలం ఓటు ద్వారా మాత్రమే సాధ్యం. ఆ ఆయుధం మీ చేతుల్లో ఉంది’ అని ప్రజలకు జేపీ సూచించారు.