: పవన్ ఏదో చేస్తాడనుకుంటే... ఆత్మహత్య చేసుకున్న కాపు యువకుడి సూసైడ్ నోట్ ముఖ్యాంశాలు!
కాపు సంఘం నేతగా పవన్ కల్యాణ్ అన్యాయాన్ని ప్రశ్నించి, ఏదో ఒక న్యాయం చేస్తారని ఎదురుచూస్తే, చివరకు ఎదురుచూపు మాత్రమే మిగిలిందని నిన్న ఆత్మహత్య చేసుకున్న కాపు యువకుడు సీహెచ్ వీఆర్ మూర్తి తన సూసైడ్ నోట్ లో వ్యాఖ్యానించాడు. ప్రశ్నించే పార్టీగా ఆయన విన్నవించుకున్నారని, చివరికి ప్రశ్నలు లేని పార్టీగా మిగిలిందని , సింహ గర్జన ద్వారా అయినా తమకు న్యాయం జరుగుతుందని ఆశించానని తెలిపాడు. 90 శాతం మార్కులు సాధించినా కాపు విద్యార్థికి చదువు దూరమవుతోందని ఆరోపించిన మూర్తి, సినీ నటుడు శివాజీపైనా ఆరోపణలు చేశాడు. ఎవరికి వారు ఏదైనా జరిగినప్పుడు మాత్రమే జనం మధ్యకు వస్తున్నారని ఆరోపించాడు. నిద్రపోతున్న ప్రభుత్వాన్ని తట్టి లేపవచ్చు కానీ, నిద్ర నటిస్తున్న ప్రభుత్వాన్ని లేపడం సాధ్యం కాదని తన ఆవేదనను పంచుకున్నాడు. మిగిలిన కులాలతో సమానంగా కాపులకు అవకాశాలు ఇవ్వాలని కోరాడు.