: తప్పంతా పీడీపీదే అంటున్న బీజేపీ... రాష్ట్రపతి పాలన దిశగా కాశ్మీర్ రాజకీయం!
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం మరోసారి రాష్ట్రపతి పాలన కిందకు రానుందా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోంది. మొన్నటి వరకూ పీడీపీ, బీజేపీ కలయికలో ప్రభుత్వం పనిచేయగా, ఇప్పుడు బీజేపీతో కలిసి ముందుకు సాగేందుకు పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ ఆసక్తిని చూపడం లేదు. దీంతో ఆమె కారణంగానే ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతున్నామని బీజేపీ ఆరోపిస్తోంది. నేడు గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాను కలవనున్న బీజేపీ బృందం ఇదే విషయాన్ని వెల్లడించి, తదుపరి చర్యలకు ఉపక్రమించాలని కోరనుంది. వోహ్రాతో బీజేపీ నేతల భేటీ సాయంత్రం 6 గంటలకు జరుగనుండగా, అంతకుముందు 4:30 గంటలకు ముఫ్తీ ఆయనతో భేటీ కానుండటంతో, ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది. కాగా, వోహ్రాను బీజేపీ చీఫ్ అమిత్ షా, జనరల్ సెక్రటరీ రాం మాధవ్ లు కలవనున్నారని తెలుస్తోంది. జనవరి 7న కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ మరణించిన తరువాత, ఆ రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇక నేటి సమావేశంలో పీడీపీ, బీజేపీ కలసి ఓ నిర్ణయానికి రాకుంటే రాష్ట్రపతి పాలనకు వోహ్రా సిఫార్సు చేయవచ్చని సమాచారం.