: జగనే కారణమైతే కేసెందుకు పెట్టరు?... మాదిగలూ ఉద్యమిస్తారన్న మంద కృష్ణ
తునిలో జరిగిన హింసాత్మక ఘటనల వెనుక వైకాపా అధినేత వైఎస్ జగన్ ఉన్నారని పదే పదే చెబుతున్న ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు ఇప్పటివరకూ ఆయనపై కేసెందుకు పెట్టలేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ ప్రశ్నించారు. మొత్తం ఘటన ప్రభుత్వ వైఫల్యం కారణంగానే జరిగిందని, నిందితుడు జగన్ అయితే, కేసు పెట్టే ధైర్యం ప్రభుత్వానికి లేదా? అని ఆయన విమర్శించారు. అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో కాపులను బీసీల్లో చేరుస్తామని తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ హామీని నెరవేర్చనందునే ప్రజలు ఉద్యమ బాట పట్టారని అన్నారు. ఇదే తరహాలో ఎస్సీ వర్గీకరణపైనా పలు హామీలిచ్చిన చంద్రబాబు, వాటిని మరచిపోయారని, కాపుల తరహాలోనే మాదిగ యువత కూడా ఉద్యమబాట పట్టనుందని అన్నారు.