: ముద్రగడ, వైఎస్సార్సీపీ పథకం ప్రకారం విధ్వంసానికి రచన చేశాయి: కళావెంకట్రావు


తూర్పుగోదావరి జిల్లా తునిలో కాపుగర్జన సందర్భంగా చోటుచేసుకున్న విధ్వంసం పథకం ప్రకారం జరిగిందని టీడీపీ నేత కిమిడి కళావెంకట్రావు తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, తునిలో రైలుకు నిప్పు పెట్టిన ఘటన అప్పటికప్పుడు చోటుచేసుకున్నది కాదని అన్నారు. ఆందోళనకారులు ఎవరైనా వెళ్లి రైలును ఆపుతారు అంతేకానీ, ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసి, వారిని దించేసి రైలు బోగీలకు నిప్పు పెట్టరని ఆయన అన్నారు. తునిలో చోటుచేసుకున్న ప్రతీ ఘటన ప్రణాళిక ప్రకారం జరిగిందేనని ఆయన స్పష్టం చేశారు. పెట్రోలు బాంబులు సిధ్ధం చేసుకోకుండానే వాహనాలపై విసిరారా? అని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ ప్రభుత్వం కాపు గర్జనను వ్యతిరేకించి ఉంటే గనుక...ఆపే శక్తి ప్రభుత్వానికి లేదా? అని ఆయన అడిగారు. కాపులకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉండబట్టే వారి సభను సజావుగా జరగనిచ్చారని ఆయన తెలిపారు. కానీ, ముద్రగడ పద్మనాభం, వైఎస్సార్సీపీ కలసి పథకం ప్రకారం విధ్వంసానికి రచన చేశారని ఆయన చెప్పారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళనకరమని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News