: కంటతడి పెట్టిన ముద్రగడ... ఉద్యమంపై జరుగుతున్న విష ప్రచారంపై కలత


నిన్న ఉగ్ర నరసింహుడిలా కనిపించిన కాపు ఐక్య వేదిక నేత ముద్రగడ పద్మనాభం... తాజాగా తనపై జరుగుతున్న విష ప్రచారంపై ఆవేదన వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టారు. నిన్న తూర్పు గోదావరి జిల్లా తునిలోని కొబ్బరి తోటల్లో జరిగిన కాపు గర్జనకు వచ్చిన లక్షలాది మంది కాపులు... ముద్రగడ నోటి నుంచి వచ్చిన సింగల్ వాక్యంతో జాతీయ రహదారిపైకే కాక రైలు పట్టాలపైకి పరుగులు పెట్టారు. కనిపించిన రైలు, బస్సులపై దాడికి దిగారు. అడ్డుకున్న పోలీసులపైనా విరుచుకుపడ్డారు. దీంతో పెను బీభత్సం జరిగిపోయింది. కాపు గర్జనకు భద్రత కల్పించేందుకు వచ్చిన పోలీసులతో పాటు కవర్ చేయడానికి వచ్చిన మీడియా ప్రతినిధులు కూడా గాయపడ్డారు. దీంతో ప్రభుత్వం వేగంగా స్పందించింది. వాస్తవాలను మరచి ముద్రగడ యువతలో ఉద్రేకాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించింది. అల్లర్లకు కారణమైన వారిలో ఏ ఒక్కరిని కూడా వదిలేది లేదని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో జరిగిన ఘోరంపై మరోమారు ఆరా తీసిన ముద్రగడ కొద్దిసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కళ్ల వెంట నీళ్లు సుడులు తిరిగాయి. ఎవరో కావాలనే ఈ హింసను ఎగదోశారన్న రీతిలో మాట్లాడిన ఆయన, హింసకు ప్రభుత్వానిదే బాధ్యత అని ఆరోపించారు. దాడులను ప్రోత్సహించే సంస్కృతి తనది కాదని చెప్పుకొచ్చారు. పోలీసులు, మీడియాపై జరిగిన దాడిని ఖండిస్తున్నానని చెప్పారు. తనపైన, తన జాతిపైనా దుష్ప్రచారం జరుగుతున్న తీరుపై ఆయన కంటతడి పెడుతూ గద్గద స్వరంతో మాట్లాడారు.

  • Loading...

More Telugu News