: ఇండియాలో తొలి రైల్వే యూనివర్శిటీ... చాన్స్ కొట్టేసిన గుజరాత్!
భారత్ లో తొలి రైల్వే యూనివర్శిటీ గుజరాత్ లోని వడోదరలో ఏర్పాటు కానుంది. వర్శిటీ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర మానవ వనరుల శాఖ విధివిధానాలను రూపొందిస్తోంది. ఇప్పటికే వడోదర లోని ప్రతాప్ విలాస్ ప్యాలెస్ ను వర్శిటీ తాత్కాలిక భవనంగా గుర్తించిన కేంద్రం, ఇక్కడ ఇండియన్ రైల్వేస్ కు ఎంపికయ్యే ఉద్యోగులకు శిక్షణ ఇవ్వనుంది. ఈ విషయాన్ని రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు. రెండు రోజుల గుజరాత్ పర్యటనకు వచ్చిన ఆయన, ఈ వర్శిటీకి అవసరమైన అన్ని వసతులను కల్పించేందుకు గుజరాత్ ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. ఇక్కడ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ (ఎన్ఏఐఆర్) ఏర్పాటవుతుందని, భూ సేకరణ తరువాత ప్రతాప్ విలాస్ ప్యాలెస్ నుంచి వర్శిటీ భవనం తరలుతుందని ఆయన అన్నారు. తొలి దశలో ఎంబీఏ, ఎంటెక్ డిగ్రీ విద్యార్థులకు డిప్లమో, రైల్వే ఆపరేషన్స్ విభాగంలో బీటెక్ కోర్సులను ఆఫర్ చేయనున్నామని మనోజ్ సిన్హా వెల్లడించారు.