: పారిస్ కన్నా భీకర దాడి... బ్రిటన్ పై ఏ క్షణమైనా ఎటాక్!: ఐఎస్ఐఎస్


పారిస్ దాడులను మించిన రీతిలో బ్రిటన్ పై భీకరంగా విరుచుకుపడనున్నట్టు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు హెచ్చరించారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసిన ఉగ్ర సంస్థ, అరబిక్ దినపత్రిక 'అల్-నబా'లో ప్రత్యేక కథనాలు ప్రచురించింది. నవంబర్ లో పారిస్ పై దాడి చేసి 130 మందిని చంపిన ఘటన కన్నా పెద్ద దాడికి బ్రిటన్ సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. బ్రిటన్ లో పుట్టి జీహాదీ జాన్ గా మారి అమెరికా డ్రోన్ల దాడిలో మరణించిన మహమ్మద్ ఎమ్వాజీ మాటలను ప్రస్తావిస్తూ, అతని మాటలు ఎన్నటికీ మరణించవని, కాలిఫేట్ లోని సైనికుల రక్తాన్ని కళ్లజూసిన వారిని వదిలేది లేదని పేర్కొంది. కాగా, ఐఎస్ఐఎస్ వీడియోను విశ్లేషించిన తరువాత బకింగ్ హామ్ ప్యాలెస్ లేదా సెంట్రల్ లండన్ లోని నేషనల్ గ్యాలరీ ఉగ్రవాదుల లక్ష్యం కావచ్చని 'ది సండే టైమ్స్' ప్రకటించింది. కాగా, ఈ హెచ్చరికలపై స్పందించిన స్కాట్ ల్యాండ్ యార్డ్ పోలీసులు, "మేము ప్రజలను అలర్ట్ గా ఉండాలని చెప్పాం. ఏ విధమైన హెచ్చరికలూ జారీ చేయలేదు. యూకేలో అంతర్జాతీయ ఉగ్రవాద మూలాలు ఉన్నాయి. దాడులు జరిగే అవకాశాలూ ఉన్నాయి. మా ఇంటలిజెన్స్ సర్వీసు విభాగం ఈ విషయమై అప్రమత్తంగా ఉంది. అవసరమైన చోట్ల సెక్యూరిటీ పెంచాం" అని తెలిపారు.

  • Loading...

More Telugu News