: 144 సెక్షన్ స్థానంలో సెక్షన్ 30...తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్
తునిలో నిన్న జరిగిన కాపు ఐక్య గర్జన హింసాత్మకంగా మారిన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మొదలైన హింస గంటల తరబడి కొనసాగింది. వెనువెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతి కష్టం మీద పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం మరోమారు అల్లర్లు చెలరేగకుండా తుని పరిసరాల్లో 144 సెక్షన్ నిషేధాజ్ఞలను అమల్లోకి తెచ్చారు. ఇదిలా ఉంటే, ముద్రగడ పద్మనాభం తునిని వదిలి కిర్లంపూడి చేరుకున్న దరిమిలా, జిల్లా వ్యాప్తంగానూ అల్లర్లు చోటుచేసుకునే ప్రమాదం లేకపోలేదన్న సమాచారంతో ప్రస్తుతం పోలీసులు నిషేధాజ్ఞలను మరింత కఠినతరం చేశారు. ఈ క్రమంలో 144 సెక్షన్ బదులు 30 పోలీస్ యాక్టును అమల్లోకి తీసుకొచ్చారు. ఈ సెక్షన్ ప్రకారం జిల్లాలోని మద్యం దుకాణాలన్నీ కూడా మూతపడనున్నాయి.