: సిగరెట్ల దారి పట్టిన బంగారం స్మగ్లర్లు!
బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తే పెద్దగా ఉపయోగం ఉండటం లేదని, లాభాలు రావట్లేదని భావిస్తున్న స్మగ్లర్లు ఇప్పుడు రూటు మార్చారు. వివిధ దేశాలకు చెందిన సిగరెట్లను, ఆయా దేశాల కరెన్సీలను ఇండియాలోకి స్మగ్లింగ్ చేస్తున్నారు. మూడేళ్ల క్రితం దిగుమతి నిబంధనలు, కస్టమ్స్ అధికారులకు అత్యాధునిక స్కానర్లు సమకూరిన తరువాత బంగారాన్ని ఇండియాలోకి తీసుకురావడం కష్టమైన తరువాత, పెట్టే పెట్టుబడితో పోలిస్తే, స్మగ్లింగ్ వెనుక దాగున్న రిస్క్ అధికంగా ఉండటంతో స్మగ్లర్ల దారి మారిందని నిఘా వర్గాలు పసిగట్టాయి. విదేశాల్లో రూ. 10 విలువున్న సిగరెట్ ను ఇండియాలోకి సక్రమంగా దిగుమతి చేయాలంటే, దాని విలువ రూ. 220కి పెరుగుతుంది. అదే స్మగ్లర్లను ఇప్పుడు ఆకర్షిస్తోంది. ఈ సిగరెట్లను దొంగతనంగా తీసుకు రాగలిగితే, ఎంత రేటుకు అమ్మినా ఇబ్బడి ముబ్బడిగా లాభాలను పండించుకోవచ్చని వారు భావిస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ ఆసియా దేశాల్లో తయారయ్యే సిగరెట్లకు ఇండియాలో డిమాండ్ ఉంది. దీంతో పాటు పలు దేశాల కరెన్సీలను కూడా ఇండియాకు చేర్చి స్మగ్లర్లు సొమ్ము చేసుకుంటున్నారు. గడచిన ఏడాదిన్నర వ్యవధిలో భారీ ఎత్తున విదేశీ కరెన్సీతో పాటు సుమారు రూ. 200 కోట్ల విలువైన 50 కంటెయినర్ల సిగరెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారంటే, పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీటిలో అత్యధికం దుబాయ్ నుంచి వచ్చినవేనని, ఇవి అన్ని ప్రాంతాల్లోని విమానాశ్రయాల్లోను తనిఖీలకు దొరికాయని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇక విదేశాల్లో తయారయ్యే డేవిడ్ ఆఫ్, గుడాంగ్ గరమ్, డీజూరమ్ బ్లాక్ స్లిమ్జ్, మూడ్స్, ఎస్సే లైట్స్, డన్ హిల్ స్విచ్, మాండ్ తదితర సిగరెట్ బ్రాండ్లకు ఇండియాలో ఎంతో డిమాండుంది. బడ్జెట్ ప్రతిపాదనల్లో భాగంగా సిగరెట్లపై ఎప్పటికప్పుడు సుంకాలను పెంచుతూ వెళ్లడం కూడా స్మగ్లర్లకు లాభిస్తోందని తెలుస్తోంది.