: అధికారం వద్దు, ప్రజల్లోకి వెళ్దాం!: మెహబూబా మనసులో మాట!
జమ్మూకాశ్మీర్ లో బీజేపీతో అధికారాన్ని పంచుకోవడానికి పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ సుముఖంగా లేరని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బదులుగా, మరోసారి ప్రజలను తీర్పు కోరాలని ఆమె భావిస్తున్నట్టు సమాచారం. బీజేపీతో కలిస్తే, పార్టీ మూలాలు దెబ్బతింటాయని భావిస్తున్న ఆమె, తాను ఒంటరిని కాదని, తన వెంట ప్రజలున్నారని పార్టీ నేతల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. అయితే, కొంతమంది పీడీపీ నేతలు సైతం ఇప్పటికిప్పుడు ఎన్నికలు వద్దని, కొంతకాలం ప్రభుత్వం నడిపిద్దామని సలహాలు ఇస్తున్నారని, వాటిని మెహబూబా పరిగణనలోకి తీసుకుంటారా? లేదా? అన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేమని పార్టీ నేత ఒకరు తెలిపారు. రాష్ట్రానికి గతంలో హామీ ఇచ్చిన విధంగా ఆర్థిక ప్యాకేజీ, వరద సాయాలను అందించడంలో కేంద్రం విఫలమైందని ఆమె ఆరోపించారు. తండ్రి మరణం తరువాత సంతాప దినాలను పాటిస్తున్నానని వెల్లడించిన ఆమె, తొలిసారిగా నేతల ముందు నోరు విప్పి తన మనసులోని మాటలు చెప్పారు. దీంతో, ఈ రెండు పార్టీల మధ్యా కొనసాగిన 10 నెలల బంధం అనిశ్చితిలో పడినట్టయింది.