: టీవీ ‘టాక్ షో’లో హఫీజ్ సయీద్... పాక్ సర్కారు ఆదేశాలను బేఖాతరు చేసిన ‘ఛానెల్ 24’
భారత వాణిజ్య రాజధాని ముంబైపై విరుచుకుపడి నరమేధం సృష్టించిన జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ ప్రసంగాలను గాని, ఆ సంస్థ కార్యకలాపాలకు సంబంధించిన వార్తలను గాని పాకిస్థాన్ మీడియా ఛానెళ్లలో ప్రసారం చేయడం నిషిద్ధం. ఈ మేరకు ’పాకిస్థాన్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ’ గతంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల్లో సయీద్ సంస్థతో పాటు లష్కరే తోయిబా, జైషే మొహ్మద్ తదితర 60 సంస్థలను పేర్కొంది. అయితే పాక్ ఆదేశాలను ఆ దేశ ప్రైవేట్ మీడియా సంస్థ ‘ఛానెల్ 24‘ బేఖాతరు చేసింది. జమాత్ ఉద్ దవా సంస్థ చీఫ్ హోదాలో హఫీజ్ సయీద్ ను ‘టాక్ షో’కు ఆహ్వానించింది. గత నెల 27న ప్రసారమైన టాక్ షోలో పాల్గొన్న సయీద్... తనదైన పాత శైలిలోనే భారత్, అమెరికాలపై విమర్శలు కురిపించాడు. దేశంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్న తమలాంటి సంస్థలపై చర్యలు తీసుకునేలా పాక్ పై... భారత్, అమెరికాలు ఒత్తిడి చేస్తున్నాయని అతడు ఆరోపించాడు. దీనిపై కాస్తంత ఆలస్యంగా స్పందించిన పాక్ రెగ్యులేటరీ అథారిటీ... ఛానెల్ 24కు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు ఆ మీడియా సంస్థ ఏమని సమాధానమిస్తుందో చూడాలి.