: 'తుని అల్లర్ల' నేపథ్యంలో షూటింగ్ కేన్సిల్ చేసుకున్న పవర్ స్టార్ ... హైదరాబాదు చేరుకున్న పవన్ కల్యాణ్... నేడు మీడియా ముందుకు!


తూర్పు గోదావరి జిల్లా తునిలో నిన్న జరిగిన కాపు గర్జనలో చోటుచేసుకున్న అల్లర్లు టాలీవుడ్ ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ షూటింగ్ ను నిలిపేశాయి. కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రధాన డిమాండ్ తో కాపు నేత ముద్రగడ పద్మనాభం ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన లభించిన సంగతి తెలిసిందే. ‘మీటింగులతో పనిలేదు, రోడ్ల మీదకెళదాం పదండి’ అంటూ ముద్రగడ ఇచ్చిన పిలుపుతో ఒక్కసారిగా పరిస్థితి కట్టుతప్పింది. కాపు వర్గమంతా రోడ్డు, రైల్వే మార్గాలపై మూకుమ్మడిగా దాడి చేసింది. దీంతో అల్లర్లు చెలరేగాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ ప్రస్తుతం కేరళలో తన తాజా చిత్రం షూటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. కాపు గర్జనలో అల్లర్లు చోటుచేసుకున్నాయన్న సమాచారంతో ఒక్కసారిగా షాక్ కు గురైన పవన్ కల్యాణ్ తన చిత్రం షూటింగ్ ను అర్థాంతతరంగా ముగించుకున్నారు. వెనువెంటనే హైదరాబాదు బయలుదేరారు. నిన్న రాత్రికే ఆయన హైదరాబాదు చేరుకున్నారు. వచ్చీ రాగానే పరిస్థితిపై ఆరా తీసిన ఆయన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. పరిస్థితిని చల్లబరిచేందుకు పవన్ కల్యాణ్ నేడు మీడియాతో మాట్లాడనున్నారు.

  • Loading...

More Telugu News