: రోడ్డు మార్గంలో ‘రత్నాచల్’ ప్రయాణికుల తరలింపు!
‘కాపు ఐక్య గర్జన’ ఆందోళనకారులు తునిలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలు బోగీలను దగ్ధం చేసిన సంఘటనలో ప్రయాణికులు కొన్ని గంటలుగా పడిగాపులు గాస్తున్న విషయం తెలిసిందే. ఈ సంఘటనలో కొంత మంది ప్రయాణికులకు స్వల్పగాయాలు కూడా అయ్యాయి. క్షతగాత్రులను రైల్వే ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కల్గడంతో ‘రత్నాచల్’ ప్రయాణికులను తుని నుంచి వారి గమ్యస్థానాలకు పంపిస్తున్నారు. కాగా, ఈ సంఘటనతో విశాఖ నుంచి వచ్చే అన్ని రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. పరిస్థితి చక్కబడే వరకు రైళ్లను నడపలేమని రైల్వే డీఆర్ఎం పేర్కొన్నారు. తుని ఘటనతో ఈ మార్గంలో 15 రైళ్లు వరకు నిలిచిపోయినట్లు చెప్పారు. ఆముదాలవలస రైల్వేస్టేషన్ లో ఫలక్ నుమా, నర్సీపట్నంలో చెన్నై సెంట్రల్ మెయిల్, తునిలో తిరుమల, వాస్కోడిగామా, రావికంపాడులో కాకినాడ- విశాఖ ప్యాసింజర్, యలమంచిలిలో నిజాముద్దీన్, హంసవరంలో సింహాద్రి ఎక్స్ ప్రెస్ రైళ్లను నిలిపివేశారు.