: తుని ఘటన..విధ్వంసకారులను వీడియోలో చిత్రీకరిస్తున్న పోలీసులు
తూర్పుగోదావరి జిల్లా తునిలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలు బోగీల విధ్వంసానికి పాల్పడ్డ విధ్వంసకారులను వీడియోలో చిత్రీకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తునిలో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని, కొంతమంది ఉద్దేశపూర్వకంగానే విధ్వంసానికి పాల్పడుతున్నారని, పోలీసులపైనే దాడికి పాల్పడుతున్నారని ఏపీ డీజీపీ జేవీ రాముడు పేర్కొన్నారు. ఆందోళనకారుల దాడిలో కొంతమంది పోలీసులు గాయపడ్డారని, పోలీసులు సంయమనం పాటిస్తున్నారని అన్నారు. లా అండ్ ఆర్డర్ ఏడీజీ, ఏలూరు రేంజ్ డీఐజీ, ఎస్పీలు ఉన్నతాధికారులను సంఘటనా స్థలానికి పంపిస్తున్నామన్నారు. అదనపు బలగాలను ఘటనా స్థలికి చేరుకుంటున్నాయని, చట్టాన్ని ఎవరు తమ చేతుల్లోకి తీసుకున్నా చర్యలు తప్పవని జేవీ రాముడు హెచ్చరించారు. అంతేకాకుండా, ఈ సంఘటన కవరేజ్ కు వెళ్లిన మీడియా ప్రతినిధులు, ఓబీ వ్యాన్లపై కూడా ఆందోళనకారులు దాడులకు పాల్పడ్డారు. కెమెరాలను లాక్కుని ధ్వంసం చేసినట్లు సమాచారం.