: వీధులూడ్చేవారు సమ్మె చేస్తుంటే, స్వయంగా రంగంలోకి దిగిన ఆప్ మంత్రులు... చీపుర్లు పట్టేశారు!
ఢిల్లీలో పారిశుద్ధ్య కార్మికులు సమ్మె బాట పట్టారు. వీధుల్లో చెత్త పేరుకుపోయింది. ప్రజలు దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నారు. చెత్తను ఊడ్చేవారెవరు? ఈ ప్రశ్నకు తమకు తాము స్వయంగా సమాధానాన్ని కనుగొంది ఆప్ సర్కారు. స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలను రంగంలోకి దించింది. వీరంతా ఢిల్లీ వీధులను శుభ్రం చేస్తూ కనిపిస్తున్నారు. వీరి చిత్రాలన్నీ సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. కాగా, తమ వేతనాలు పెంచాలని ఢిల్లీ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన సాగిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రత్యేక ఉద్యోగులను నియమించి మరీ ఢిల్లీ వీధులను ప్రభుత్వం శుభ్రం చేయిస్తున్నప్పటికీ, వీధులు చెత్తతో నిండుతున్నాయన్న ఫిర్యాదులు పెరుగుతున్నాయి. దీంతో ఆందోళనలను తగ్గించడానికి మంత్రులు చీపుర్లు పట్టారు. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో పాటు కపిల్ మిశ్రా, ఇమ్రాన్ హుస్సేన్ తదితరులు తమతమ ప్రాంతాల్లో చీపురులు పట్టారు.