: కేసీఆర్ ఓ కుంభకర్ణుడు: నారా లోకేశ్
తెలంగాణ ముఖ్యమంత్రి ఓ కుంభకర్ణుడిలా పాలనను గాలికొదిలి నిద్రపోతున్నాడని తెలుగుదేశం యువనేత నారా లోకేశ్ విమర్శించారు. తెలంగాణకు ఎన్ని ఇళ్లు కావాలని కేంద్రం అడిగితే కేసీఆర్ నిద్రపోతూ, దానికి సమాధానం చెప్పలేదని గుర్తు చేసిన ఆయన, ఆ కారణంగానే తొలుత కేంద్రం ఇళ్లను మంజూరు చేయలేదని చెప్పుకొచ్చారు. హైటెక్ సిటీ నుంచి ఈ ఉదయం బయలుదేరిన బైక్ ర్యాలీ మియాపూర్ చేరగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, ప్రజలను ఉద్దేశించి లోకేశ్ ప్రసంగించారు. కేసీఆర్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతే, తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్వయంగా మోదీకి ఫోన్ చేసి తెలంగాణ ప్రజలను అన్యాయం చేయవద్దని చెప్పగా, అప్పటికప్పుడు 50 వేల ఇళ్లను కేంద్రం మంజూరు చేసిందని వివరించారు. తెలంగాణలో డబుల్ బెడ్ రూం ఇళ్ల ఘనత కచ్చితంగా ఎన్డీయే ప్రభుత్వానిదేనని చెప్పుకొచ్చిన లోకేశ్, గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలని కోరారు. స్మార్ట్ సిటీల తొలి జాబితాలో తెలంగాణ నగరాలు లేకపోవడానికి కారణం కూడా కేసీఆర్ కుంభకర్ణ నిద్ర మాత్రమే కారణమని నిప్పులు చెరిగారు. కేంద్రానికి రాష్ట్రాలన్నీ సమానమేనని, వారు కోరినప్పుడు స్పందించకుండా, ఆ తరువాత నోటికొచ్చినట్టు మాట్లాడటం కేసీఆర్ కు అలవాటైపోయిందని ఎద్దేవా చేశారు. మాయమాటలు చెప్పి తప్పించుకునే టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయవద్దని కోరారు. ఒక్క వారం రోజుల్లో తెలుగుదేశం పార్టీ జోష్ ఎలా ఉందో చూపించామని, మరో ఐదు రోజుల్లో గ్రేటర్ పీఠం కైవసం కానుందని అన్నారు.