: గ్రేటర్ పీఠం కచ్చితంగా మనదే: నేతలతో చంద్రబాబు
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం విజయాన్ని ఎవరూ ఆపలేరని, అత్యంత కీలకమైన ఈ రెండు రోజులూ నేతలు, కార్యకర్తలూ గట్టిగా కృషి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సూచించారు. ఈ ఉదయం పలువురు నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, తెరాస ప్రభుత్వం పెడుతున్న కేసుల గురించి పట్టించుకోవద్దని, గెలుపే లక్ష్యంగా మరో రెండు రోజులు కష్టపడాలని తెలిపారు. గ్రేటర్ లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉండటాన్ని కళ్లారా చూసిన కేసీఆర్, దాన్ని భరించలేకపోతున్నారని విమర్శించారు. అసహనంతో ఆయన తన స్థాయిని మరచి అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. "మొన్నటికి మొన్న హైదరాబాద్ లో నీకేం పని? అని ప్రశ్నించిన ఆయన, నిన్న నా భార్య పేరు ప్రస్తావిస్తూ అసత్యాలు చెప్పారు. ఓడిపోతామన్న భయంతోనే కేసీఆర్ ఇలా చేస్తున్నాడు" అని చంద్రబాబు దుయ్యబట్టారు. గ్రేటర్ ఎన్నికల్లో తెరాస చేస్తున్న అధికార దుర్వినియోగాన్ని ఎక్కడికక్కడ అడ్డుకోవాలని ఆయన సూచించారు.