: ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా ఎస్పీ ప్రసంగించారంటూ నెల్లూరులో ఆందోళన... తీవ్ర ఉద్రిక్తత!


ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా నెల్లూరు ఎస్పీ గజారావు భూపాల్ మాట్లాడారని ఆరోపిస్తూ, కొందరు ఆందోళనకారులు విధ్వంసం సృష్టించడంతో నెల్లూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగిన సదస్సులో ప్రసంగించిన ఆయన, కొన్ని దేశాల్లో పేద యువకులను ఉగ్రవాదం వైపు ఆకర్షించడానికి ఎటువంటి పనులు చేస్తున్నాయో వివరించారు. ఆ దిశగా పయనిస్తే, జీవితాలు నాశనం అవుతాయని చెప్పారు. ఆపై, తమ ఆచారాలను కించపరిచేలా ఎస్పీ ప్రసంగం ఉందని ఆరోపిస్తూ, వందలాది మంది ముస్లిం యువకులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగారు. గజారావు వాహనంతో పాటు మరో జీపును, స్టేషన్ బయటున్న ఫర్నీచరును ధ్వంసం చేశారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులను జరపాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు అదనపు బలగాలను పంపి, ఆ ప్రాంతంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ధర్నా కొనసాగింది. నెల్లూరు మేయర్ అజీజ్, ఇతర మత పెద్దలు రంగంలోకి దిగి ఆందోళనకారులతో మాట్లాడి వారిని శాంతపరిచారు.

  • Loading...

More Telugu News