: ఏడాది కొడుకుతో ఐఎస్ఐఎస్ లో చేరేందుకు సిరియా వెళ్లిన బ్రిటన్ మహిళ


ఏడాది కొడుకుతో ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థలో చేరేందుకు ఓ బ్రిటన్ మహిళ సిరియా వెళ్లింది. అయితే, అక్కడి పరిస్థితులను చూసి గుట్టుచప్పుడు కాకుండా బ్రిటన్ తిరుగు ప్రయాణం సాగించింది. బ్రిటన్ లో ఆమెను భద్రతాధికారులు అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. తరీనా షకీల్ (26) అనే బ్రిటన్ మహిళ ఏడాది కుమారుడ్ని తీసుకుని 2014 టర్కీ వెళ్లింది. అక్కడ సిరియా సరిహద్దులు దాటి ఐఎస్ఐఎస్ కలిఫత్ నగరంగా పేర్కొంటున్న నగరానికి వెళ్లింది. అక్కడ మూడు నెలలు నివసించింది. అనంతరం ఫిబ్రవరిలో తిరిగి బ్రిటన్ చేరింది. విమానం దిగగానే భద్రతాధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఐఎస్ఐఎస్ కు పని చేసినందుకుగాను అరెస్టు చేసినట్టు ఆమెకు చెప్పి ఆమె కుమారుడ్ని ప్రభుత్వ సంరక్షణ కేంద్రానికి పంపారు. దీంతో తాను ఐఎస్ఐఎస్ కు అనుకూలంగా పని చేయలేదని, కఠినమైన చట్టాలు అమలయ్యే కలిఫత్ నగరంలో నివసించాలనే లక్ష్యంతో సిరియా వెళ్లానని ఆమె చెప్పింది. అయితే ఆమె సిరియా వెళ్లడానికి ముందు ఐఎస్ఐఎస్ లో చేరాలంటూ ట్విటర్లో చేసిన పోస్టులు, ఆమె సెల్ ఫోన్ లో సిరియాలో ఐఎస్ఐఎస్ జెండా, తీవ్రవాదులతో కలిసి తీసుకున్న ఫోటోలను న్యాయస్థానం ముందు పోలీసులు పెట్టారు. దీంతో ఆమెను దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం సోమవారం శిక్ష విధించనుంది.

  • Loading...

More Telugu News