: దేశంలో ప్రతి విద్యార్థిని అప్రమత్తం చేయడానికే నేను వచ్చాను: రాహుల్ గాంధీ
రోహిత్ అనుభవించిన ఒత్తిడి రేపు మరో విద్యార్థి అనుభవించకూడదని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ జన్మదినం సందర్భంగా నిర్వహించిన మౌన దీక్షలో పాల్గొన్న అనంతరం రాహుల్ మాట్లాడుతూ, బీజేపీ విద్యార్థి సంఘాలు తనను విమర్శిస్తున్నాయని అన్నారు. ఇక్కడికెందుకు వచ్చావంటూ అడుగుతున్నారని, దేశంలో మరే విద్యార్థి ఇలాంటి ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడకూడదనే ఉద్దేశ్యంతోనే తాను హెచ్ సీయూకి వచ్చానని అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ వారివారి భావాలు వ్యక్తం చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఈ రోజు రోహిత్ బాధితుడయ్యాడు, రేపు ఏబీవీపీలో మరో విద్యార్థి బాధితుడు కావచ్చని, అప్పుడు ఏబీవీపీ ఆందోళన చేయడం మానేస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. విద్యార్థులు చైతన్యవంతులు కావాలి కానీ, ఒత్తిడిలో ప్రాణాలు తీసుకునే వారిగా మారకూడదని ఆయన సూచించారు. బీజేపీ తన భావజాలాన్ని ప్రజలపై రుద్దేందుకు ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు. యూనివర్సిటీల్లో వివక్షతో దేశం ముందుకు సాగదని ఆయన స్పష్టం చేశారు. గతంలో గాంధీకి జరిగిన అవమానం లాంటిదే రోహిత్ కు జరిగిందని ఆయన విమర్శించారు. దేశంలో పాలక పార్టీలు కుల, మత, వర్గ, వర్ణ వివక్ష చూపకూడని ఆయన చెప్పారు. కేవలం బీజేపీ మాత్రమే దేశభక్తి కలిగిన పార్టీ కాదని, దేశంలో తనతో పాటు ఎందరో యువకులు దేశభక్తులు ఉన్నారని ఆయన చెప్పారు. తమ లాంటి వారి దేశభక్తిని శంకించవద్దని ఆయన సూచించారు. ఈ సందర్భంగా గాంధీ చెప్పిన ఓ వాక్యాన్ని ఆయన గుర్తు చేశారు. నేను హింసను ప్రోత్సహించను...కానీ తలవంచడాన్ని మాత్రం ఒప్పుకోను...హక్కుల సాధనకు పోరాడాలని ఆయన అన్నారు.