: మహిళా పోలీసు అధికారిని బదిలీ చేయించిన కర్ణాటక మంత్రి... నివేదిక కోరిన ఏఐసీసీ
కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీలో ఓ చిన్న అంశం పెను వివాదంగా మారింది. తాను ఫోన్ చేస్తే, లైన్ లోనే వెయిట్ చేయించారంటూ ఓ మహిళా పోలీసు అధికారిపై ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పరమేశ్వర్ నాయక్ శివాలెత్తిపోయారు. బహిరంగ సభలోనే ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన సదరు పోలీసు అధికారిని తక్షణమే బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మొత్తం తతంగాన్ని వీడియో తీసిన గుర్తు తెలియని వ్యక్తులు దానిని సోషల్ మీడియాలో పెట్టేశారు. ఈ వీడియో వైరల్ అయిపోయింది. విషయం అధిష్ఠానం చెవిలో పడిపోయింది. దీనిపై తక్షణమే సమగ్ర నివేదిక అందజేయాలని కర్ణాటక పీసీసీని అధిష్ఠానం ఆదేశించింది. దీనిపై ఆ రాష్ట్ర హోం శాఖ మంత్రి, కేపీసీసీ చీఫ్ పరమేశ్వర్ స్పందించారు. ‘‘మంత్రి వ్యవహార సరళి మంచిది కాదు. దీనిని ఖండిస్తున్నాం. ఇప్పటికే సదరు మంత్రితో ఫోన్ లో మాట్లాడాను. ఘటనపై తనకు సవివరంగా సంజాయిషీ ఇస్తానని ఆ మంత్రి చెప్పారు’’ అంటూ పరమేశ్వర్ చెప్పారు.