: క్రిమినల్స్ కంటే హీనంగా చూశారు!... బాబ్లీ ఘటనను గుర్తు చేసుకున్న చంద్రబాబు
మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై నాటి ఉమ్మడి ఏపీ సరిహద్దు (ప్రస్తుతం తెలంగాణ సరిహద్దు) బాబ్లీ వద్ద నిర్మించతలపెట్టిన ప్రాజెక్టును విపక్ష హోదాలో గతంలో టీడీపీ అడ్డుకుంది. పొరుగు రాష్ట్రాల అభ్యంతరాలతో పాటు కేంద్రం, న్యాయస్థానాల సూచనలను బేఖాతరు చేస్తూ మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని ముమ్మరం చేసింది. దీనిపై నాటి కొణిజేటి రోశయ్య ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. ప్రతిపక్షనేత హోదాలో ఉన్న ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన పార్టీ టీడీపీ నేతలతో కలిసి బాబ్లీ వద్దకు వెళ్లారు. మహారాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అక్కడ ధర్నాకు దిగే యత్నం చేశారు. అయితే ఓ రాష్ట్రానికి పదేళ్ల పాటు సీఎంగా వ్యవహరించిన నేత అన్న కనీస మర్యాద కూడా లేకుండా మహారాష్ట్ర ప్రభుత్వం దురుసుగా వ్యవహరించింది. మహారాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆ రాష్ట్ర పోలీసులు... టీడీపీ నేతలు నామా నాగేశ్వరరావు, ఎర్రబెల్లి దయాకరరావు తదితరులపై లాఠీలు ఝుళిపించడమే కాక చంద్రబాబు సహా అందరిని ఓ పాడుబడ్డ కళాశాల భవనంలోకి నెట్టేసింది. నాటి ఘటనను కొద్దిసేపటి క్రితం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. గ్రేటర్ ఎన్నికలను పురస్కరించుకుని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కోసం తాము చేసిన సాహసాలను గుర్తు చేసుకున్న ఆయన బాబ్లీ ఘటనను మననం చేసుకున్నారు. నాడు మహారాష్ట్ర పోలీసులు తమను క్రిమినల్స్ కంటే హీనంగా చూశారని చంద్రబాబు పేర్కొన్నారు. పోలీసుల లాఠీ దెబ్బలతో నామాకు గాయమైందన్నారు. ఉత్తర తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకునేందుకే నిర్ణయించుకున్న తాము పాడు బడ్డ గదిలో వేసినా, న్యాయం జరిగేదాకా అక్కడి నుంచి కదిలేది లేదని తేల్చిచెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం రాజీ లేని పోరు సాగించిన తమను గ్రేటర్ ఓటర్లు ఆదరిస్తారని చంద్రబాబు చెప్పారు.