: ద్రవ్యోల్బణాన్ని వివరించేందుకు... ‘దోసె సిద్ధాంతం’ వినిపించిన ఆర్బీఐ గవర్నర్
కాకలు తీరిన ఆర్థిక వేత్తలు మినహా సామాన్యులకు ద్రవ్యోల్బణాన్ని అర్థం చేసుకోవడం ఎప్పుడూ ఇబ్బందే. ద్రవ్యోల్బణం పెరిగితే ఏమవుతుంది?.., తగ్గితే ఏమవుతుంది? అన్న విషయాలపై కాస్తంత అవగాహన ఉన్నా, ప్రత్యక్ష ప్రభావం ఎలాం ఉంటుందన్న దానిపై స్పష్టమైన అవగాహన దాదాపుగా ఉండదు. ద్రవ్యోల్బణం అంటే ఏమిటో... సామాన్యులకు కూడా అర్థమయ్యేలా చెప్పేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ రాజన్ నిన్న ఓ కొత్త సిద్ధాంతాన్ని వినిపించారు. అదే ‘దోసె సిద్ధాంతం’. ఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనమిక్ రీసెర్చి (ఎన్ సీఏఈఆర్)లో నిన్న సీడీ దేశ్ ముఖ్ స్మారక ఉపన్యాసం చేసిన సందర్భంగా రఘురామ రాజన్ నోట వినిపించిన ఈ కొత్త సిద్ధాంతం ఆసక్తికరంగా సాగింది. ‘‘ద్రవ్యోల్బణం తక్కువగా ఉండాలి. డిపాజిట్లపై వడ్డీ రేటు ఎక్కువగా ఉండాలి. అప్పుడే పెన్షనర్ల జీవితం హాయిగా ఉంటుంది. వారు ఎంచక్కా నాలుగు దోసెలు కొనగలరు. తినగలరు. ద్రవ్యోల్బణం తగ్గినప్పుడు... కొనుగోలు శక్తి పెరుగుతుంది. అప్పుడు ఒకవేళ వడ్డీ రేటు తక్కువగా ఉన్నప్పటికీ... పెన్షనర్లు ఎక్కువ దోసెలు తినగలరు’’ అని రాజన్ ఆ సిద్ధాంతాన్ని వల్లె వేశారు. కాస్తంత హ్యూమరస్ గానే అనిపించినా, సామాన్యులకు కూడా ఈ సిద్ధాంతంతో ద్రవ్యోల్బణం ప్రభావం ఇట్టే అర్థమవుతోంది.