: జికా వైరస్ ఆందోళన వద్దు: జేపీ నడ్డా
ప్రపంచాన్ని వణికిస్తున్న జికా వైరస్ పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. జికా వైరస్ పై ఎయిమ్స్ వైద్యులు, నిపుణులు, అధికారులతో చర్చించామని ఆయన తెలిపారు. జికా వైరస్ కు సంబంధించిన భయం అక్కర్లేదని, అయితే అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. పరిస్థితిని సమీక్షించేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. నిపుణుల బృందం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అయితే రాష్ట్రాలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కాగా, జికా వైరస్ సోకితే డెంగ్యూను పోలిన లక్షణాలు కనబడతాయని నిపుణులు వెల్లడించారు. జికా వైరస్ గర్భిణులకు సోకితే చిన్న తలతో శిశువులు జన్మించే ప్రమాదం ఉందని వారు తెలిపారు. మెదడులో లోపాలు ఏర్పడతాయని నిపుణులు హెచ్చరించారు. కాగా, బ్రెజిల్, ఎల్ సాల్వెడార్ లలో జికా వైరస్ ప్రమాదకర స్థాయిలో విస్తరించడంతో అక్కడి ప్రభుత్వాలు మూడేళ్ల వరకు గర్భం ధరించకుండా ఉండడమే మేలని సలహా ఇస్తున్నాయి. అలాగే అక్కడి ప్రభుత్వాలు అంగుళం కూడా వదలకుండా దోమలను పారద్రోలే పొగను చల్లుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా జికా వైరస్ 40 లక్షల మందికి సోకినట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది.