: టీఆర్ఎస్, టీడీపీ కుమ్మక్కయ్యాయి: బొత్స
టీఆర్ఎస్, టీడీపీలు కుమ్మక్కయ్యాయని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, 'ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ప్రథమ ముద్దాయి' అని ఆరోపించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... 'ఫోన్ ట్యాపింగ్ లో ముద్దాయి కేసీఆర్' అని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు ఆ విషయంపై మాట్లాడడం లేదని అన్నారు. దీంతో వారిద్దరూ కుమ్మక్కయ్యారని అర్థమవుతోందని ఆయన చెప్పారు. కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకే గ్రేటర్ ఎన్నికల్లో హామీలు ఇస్తున్నారని, వాస్తవానికి ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆయన చెప్పారు. అలా కుమ్మక్కు కాలేదని ఆ రెండు పార్టీలు చెబితే...విభజన చట్టంలో పేర్కొన్న విధంగా హైదరాబాదులో సెక్షన్ 8 అమలుకు టీఆర్ఎస్ సిద్ధమా? అని ప్రశ్నించారు. హైదరాబాదులో ఎనిమిదేళ్లు ఉండి పరిపాలన సాగించేందుకు చంద్రబాబు సిద్ధమా? అని ఆయన అడిగారు. విమర్శలు మాని తన ప్రశ్నకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.