: నేను భారీ షాట్లు అడలేను: కోహ్లీ
మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో ఆడుతుంటే భారత్ లోని ప్రధాన పట్టణాల్లో ఆడుతున్నట్టు ఉందని విరాట్ కోహ్లీ తెలిపాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ, ఆస్ట్రేలియాలో ఆడడం ఆనందాన్నిస్తుందని అన్నాడు. ఇక్కడి పిచ్ లు తన ఆటతీరుకు అతికినట్టు సరిపోతాయని కోహ్లీ పేర్కొన్నాడు. వేగంగా దూసుకువచ్చిన బంతులపై టెక్నిక్ వాడితే సరిపోతుందని చెప్పాడు. తన బలహీనతలు తనకు తెలుసని చెప్పిన కోహ్లీ, తాను భారీ షాట్లు ఆడలేనని స్పష్టం చేశాడు. అడపాదడపా భారీ షాట్లు కొట్టగలనని అన్నాడు. అందుకే తాను టెక్నిక్ ను నమ్ముకుంటానని చెప్పాడు. ఫీల్డర్ల గ్యాప్ లోంచి బంతిని తరలించడాన్ని ఇష్టపడతానని కోహ్లీ తెలిపాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవడం సంతోషం ఇచ్చినా, వరుసగా రెండు టీట్వంటీల్లో విజయం సాధించడం మరింత సంతోషాన్ని కలిగించిందని కోహ్లీ పేర్కొన్నాడు.