: భద్రతా లేమితో పాక్ లో 230 విద్యాసంస్థలు మూసివేత
పాకిస్థాన్ లోని విద్యా సంస్థలే లక్ష్యంగా తాలిబన్లు దాడులకు తెగబడుతుండటంతో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల బచాఖాన్ యూనివర్సిటీపై తాలిబన్లు దాడిచేసి 21 మందిని చంపేశారు. దాంతో దాదాపు 230 విద్యాసంస్థలను మూసివేశారు. దేశంలో తాలిబన్ల దాడుల హెచ్చరికల నేపథ్యంలో, విద్యా సంస్థలకు భద్రత కూడా అంతగా లేకపోవడంతో పాక్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మూసివేసిన విద్యా సంస్థల్లో ఎక్కువగా ప్రభుత్వ విద్యా సంస్థలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాక్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో విద్యా సంస్థలకు ఎల్లుండిలోగా గట్టి భద్రత ఏర్పాటు చేయాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే 138 విద్యాసంస్థలు మూతపడగా, రావల్పిండిలోని మెడికల్ కళాశాల సహా ఆ ప్రాంతంలోని 53 విద్యా సంస్థలకు అధికారులు భద్రత పెంచాలని నోటీసులు జారీ చేశారు. జీలంలో 20 ప్రభుత్వ, 5 ప్రైవేటు పాఠశాలలను సీజ్ చేశారు.