: డిప్రెషన్ లో ఉండడం వల్లే అలా చేశా...క్షమించండి!: క్యాబ్ డ్రైవర్ ను కొట్టిన మహిళ


గత వారం అమెరికాలోని ఫ్లోరిడాలోని మియామీలో జాక్సన్ హెల్త్ సిస్టమ్స్ లో న్యూరాలజీ రెసిడెంట్ డాక్టర్ గా పని చేస్తున్న రామకి సూన్ (30) అనే మహిళా ఉద్యోగి పూటుగా మద్యం సేవించి ఉబెర్ క్యాబ్ డ్రైవర్ పై దాడికి తెగబడి నడి రోడ్డుపై నానాయాగీ చేసిన సంగతి తెలిసిందే. దానిని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది హల్ చల్ అయింది. దీంతో, ఈ ఘటనపై ఆమె వివరణ ఇస్తూ, క్షమాపణలు కోరింది. తన జీవితంలో అది దుర్దినమని ఆమె పేర్కొంది. ఆ రోజు తన తండ్రి ఆసుపత్రిలో చేరారని, ఆ బాధలో ఉండగానే తన ప్రియుడు తన నుంచి విడిపోయాడని ఆమె తెలిపింది. దీంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయానని, దీంతో బాగా తాగేశానని చెప్పింది. మద్యం తాగి డ్రైవింగ్ చేయడం సరికాదని భావించి, కారును వదిలేశానని, ఇంతలో అటుగా వస్తున్న ఉబెర్ క్యాబ్ డ్రైవర్ తో అభ్యంతరకరంగా ప్రవర్తించడం జరిగిందని ఆమె జరిగిన ఘటనను గుర్తు చేసుకుంది. తన ప్రవర్తన వల్ల చాలా మందిని బాధపెట్టానని పేర్కొన్న ఆమె, దీనిపై క్షమాపణలు కోరుతున్నానని తెలిపింది. కాగా, ఆమెను విధుల్లోంచి తప్పించిన జాక్సన్ హెల్త్ సిస్టమ్స్ ఆసుపత్రి లాంగ్ లీవ్ లో ఆమెను ఉంచింది. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News