: వ్యక్తిగత రైల్వే టికెట్ల రిజర్వేషన్ సంఖ్య కుదింపు
వ్యక్తిగతంగా రైల్వే టికెట్లను రిజర్వేషన్ చేసుకునే సంఖ్యను కుదించారు. ఇప్పటివరకు ప్రతి వ్యక్తి నెలకు పది టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం ఉంది. ఇకనుంచి ఓ వ్యక్తి ఆన్ లైన్ లో నెలకు ఆరు టికెట్లు మాత్రమే రిజర్వ్ చేసుకునే అవకాశముందని రైల్వే శాఖ తెలిపింది. ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో ఫిబ్రవరి 15 నుంచి ఈ నిబంధన అమల్లోకి రాబోతుంది. ఇటీవల రైల్వే శాఖ ఓ సర్వే నిర్వహించింది. అందులో 90 శాతం మంది మాత్రమే ఒక నెలలో ఆరు టికెట్లు రిజర్వేషన్ చేసుకుంటున్నారని, మిగతా 10 శాతం మంది పది టికెట్లు బుక్ చేస్తున్నారని తేలింది. వారిని దళారులుగా అనుమానిస్తున్న రైల్వే శాఖ... అలాంటి వారికి చెక్ పెట్టాలని ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగానే బుకింగ్ సంఖ్యను తగ్గించారు. అయితే తత్కాల్, అడ్వాన్స్ రిజర్వ్ బుకింగ్ సందర్భాల్లో పాత విధానమే కొనసాగుతుందని రైల్వే శాఖ ప్రకటించింది.