: జానాపై హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తా: ఎమ్మెల్సీ పాల్వాయి
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సీఎల్పీ నేత జానారెడ్డి వ్యవహరించిన తీరు తెలంగాణ కాంగ్రెస్ నేతలను విస్మయానికి గురి చేస్తోంది. నిన్న(గురువారం) తన కార్యాలయానికి ఐదు రూపాయల భోజనం తెప్పించుకుని తిన్న జానా, చాలా బావుందంటూ కితాబిచ్చారు. మీరు కూడా తినండంటూ మీడియా వారిని కూడా కోరారు. దాంతో ఆ పార్టీ నేతలు లోలోపల ఆయనపై ఆగ్రహంతో ఉన్నారు. కానీ పార్టీ ఎమ్మెల్సీ పాల్వాయి గోవర్థన్ రెడ్డి మాత్రం బహిరంగంగానే హైదరాబాద్ లో స్పందించారు. రూ.5కే భోజనంపై టీఆర్ఎస్ ను జానా మెచ్చుకోవడం బాధాకరమన్నారు. దానిపై ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. త్వరలో ఆయనపై పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేయనున్నానని తెలిపారు. ఇదే సమయంలో ఎంఐఎం తమకు మిత్రపక్షమన్న కేసీఆర్ మాటలపై పాల్వాయి అసహనం వ్యక్తం చేశారు. అలా అనడం దురదృష్టకరమని పేర్కొన్నారు.