: తిరువనంతపురంలో మరోసారి ఉద్రిక్తత... లెఫ్ట్ కార్యకర్తలపై లాఠీ చార్జీ, టియర్ గ్యాస్ ప్రయోగం
కేరళ రాజధాని తిరువనంతపురంలో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోలార్ స్కాంలో సీఎం ఉమెన్ చాందీపై కేసు నమోదుకు ఆ రాష్ట్ర కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాందీ రాజీనామాను డిమాండ్ చేస్తూ నిన్నటి నుంచే నగరంలో విపక్షాలు ఆందోళనలకు తెరతీశాయి. నేటి ఉదయం తనపై కేసు నమోదుకు కింది కోర్టు ఆదేశాలు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ చాందీ హైకోర్టును ఆశ్రయించారు. కింది కోర్టు తీర్పును నిలుపుదల చేయాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. సమాచారం అందుకున్న లెఫ్ట్ పార్టీలు అందోళనలను మరింత తీవ్రతరం చేశాయి. తమను నిలువరించేందుకు రంగంలోకి దిగిన పోలీసులపై లెఫ్ట్ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఎంతకూ ఆందోళనకారులు వెనుదిరగకపోవడంతో పోలీసులు బాష్ప వాయు గోళాలను ప్రయోగించారు. దీంతో నగరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.