: ప్రపంచంలోనే ఆరో ధనికుడిగా మార్క్ జుకెర్ బర్గ్... ఒక్కరోజులో పెరిగిన 6 బిలియన్ డాలర్ల సంపద


ఫేస్ బుక్ చీఫ్ మార్క్ జుకెర్ బర్గ్ ఇంట నిజంగా లక్ష్మీదేవే పుట్టింది. కూతురు పుట్టిన శుభవేళ రెండు నెలల పాటు పితృత్వ సెలవు తీసుకుని తిరిగి విధుల్లోకి చేరిన మరుక్షణం జుకెర్ బర్గ్ ప్రపంచంలోనే ఆరో అత్యంత ధనికుడిగా అవతరించారు. ఫేస్ బుక్ షేర్ల విలువ ఒక్కసారిగా 13 శాతం పెరిగిన నేపథ్యంలో జుకెర్ బర్గ్ ఆస్తుల విలువ కూడా అమాంతంగా పెరిగింది. నిన్నటితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో కంపెనీ నెట్ వర్త్ 53 శాతం పెరిగింది. దీంతో ఊహించని విధంగా ఒక్కసారిగా జుకెర్ బర్గ్ ఆస్తుల విలువ 47.5 బిలియన్ డాలర్లకు చేరింది. అదే సమయంలో ఫేస్ బుక్ నికర లాభం 1.56 బిలియన్ డాలర్లకు చేరింది. బ్లూమ్ బర్గ్ డేటా ప్రకారం ప్రస్తుతం జుకెర్ బర్గ్ కంటే... బిల్ గేట్స్, జరా వ్యవస్థాపకుడు అమాన్సియో ఒర్టెగా, వారెన్ బఫెట్, అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్, టెలికాం మాగ్నెట్ కార్లోస్ స్లిమ్ హెలూ మాత్రమే సంపదలో ముందున్నారు. మరో ఆశ్చర్యకర విషయమేంటంటే... ఒకే ఒక్క రోజులో జుకెర్ బర్గ్ ఆస్తుల విలువ 6 బిలియన్ డాలర్ల మేర పెరిగింది.

  • Loading...

More Telugu News