: మరోసారి హెచ్ సీయూకు రాహుల్ గాంధీ... నేటి రాత్రి నుంచి రేపు సాయంత్రం దాకా మాస్ హంగర్ స్ట్రయిక్
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోమారు హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీకి వస్తున్నారు. వర్సిటీ రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య నేపథ్యంలో ఇటీవలే హైదరాబాదు వచ్చిన రాహుల్ గాంధీ వర్సిటీ విద్యార్థులనుద్దేశించి ఉద్రేకపూరిత ప్రసంగం చేశారు. తాజాగా రేపు రోహిత్ వేముల బర్త్ డే అని తెలుసుకున్న రాహుల్ గాంధీ కొద్దిసేపటి క్రితం కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి రాత్రి నుంచి రేపు సాయంత్రం దాకా రోహిత్ కుటుంబ సభ్యులతో కలిసి వర్సిటీ ప్రాంగణంలో మాస్ హంగర్ స్ట్రయిక్ (సామూహిక నిరాహారదీక్ష) చేసేందుకు రాహుల్ గాందీ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు హెచ్ సీయూ విద్యార్థి సంఘాల నేతలు ప్రకటించారు. అయితే రాహుల్ పర్యటనను కాంగ్రెస్ పార్టీ వర్గాలు ధ్రువీకరించాల్సి ఉంది. పర్యటన ఖరారైతే నేటి సాయంత్రం ఢిల్లీ నుంచి బయలుదేరనున్న రాహుల్ గాంధీ నేరుగా హైదరాబాదులోని సెంట్రల్ వర్సిటీకి చేరుకుంటారు. అర్ధరాత్రి నుంచి రేపు పగలంతా వర్సిటీలోనే ఆయన మాస్ హంగర్ స్ట్రయిక్ చేస్తారు.